యాప్నగరం

‘అణు’వంత బాంబుకు లక్షలాది ప్రాణాలు బలి.. ఈ ఫొటోలు కంటతడి పెట్టిస్తాయి!

కయ్యానికి కాలుదువ్విన జపాన్.. భారీ మూల్యం చెల్లించుకున్న రోజు. దురాక్రమణ దాహం ఫలితంగా ప్రజల ప్రాణాలు పోయాయ్. అసలు ఆ రోజు ఏం జరిగింది?

Suresh Chelluboyina | Samayam Telugu 7 Aug 2019, 10:36 pm
73 ఏళ్ల నాటి ఆ పాపం అమెరికాను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. 1945లో సరిగ్గా ఇదే నెల (ఆగస్టు) 6, 9వ తేదీల్లో జపాన్‌‌లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన అణు బాంబు ఆ దేశంలో 1.40 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. పసి బిడ్డల నుంచి పెద్దల వరకు అంతా మాంసం ముద్దల్లా మారిపోయారు. భవనాలు నేలమట్టమై నగరాలన్నీ క్షణాల్లో వల్లకాడయ్యాయి.
Samayam Telugu 20


ఈ విధ్వంసం జరిగి 73 ఏళ్లు గడిచినా.. నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ అణు బాంబు వల్ల ఇప్పటికీ ఆ ప్రాంతంలో పంటలు పండవు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేడియేషన్, కాలిన గాయాలు, పౌష్టికాహర లోపం వల్ల ఆ నాడు ప్రజలు బతికుండగానే నగరం చూశారు. అంతటి విధ్వంసం నుంచి కూడా జపాన్ కోలుకోగలిగిందంటే అక్కడి ప్రజలు, పాలకుల పట్టుదలనే చెప్పుకోవాలి.

ఆ రోజు ఏం జరిగింది?:
1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉంది. వాస్తవానికి నాటి యుద్ధం జపాన్ దురాక్రమణతోనే మొదలైంది. చివరికి జపాన్‌పై అణు బాంబు దాడితో యుద్ధం ముగిసింది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న మిత్ర రాజ్యాలు పోట్స్‌డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేకుంటే భారీ వినాశనం చూడాల్సి వస్తుందని హెచ్చరించాయి. అయితే, జపాన్ ఆ బెదిరింపులకు లొంగలేదు. దీంతో అమెరికా అణు బాంబుతో జపాన్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
ఈ సందర్భంగా 1945 ఆగస్టులో మన్‌హట్టన్‌లో రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. అదే ఏడాది ఆగస్టు 6న అమెరికా విమానాలు జపాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. అప్పటికే ఇంధన నిల్వలు అడుగంటడంతో జపాన్ ఆ విమానాలను అడ్డుకునేందుకు తమ వైమానానికి దళాన్ని పంపలేకపోయింది. దీంతో అమెరికాకు చెందిన బి-29 విమానం ‘ఎనోలాగే’ నుంచి.. 3.5 మీటర్ల పొడవు, 4 టన్నుల బరువుండే ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును హిరోషిమాపై వదిలింది.
ఆ బాంబు పడగానే జపాన్ మొత్తం భూకంపం వచ్చినట్లు వణికిపోయింది. సుమారు 12,500 టన్నుల టీఎంటీతో సమానమైన శక్తి ఉత్పన్నమైంది. అక్కడి ఉష్ణోగ్రత 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. మనుషులంతా క్షణాల్లో మసైపోయారు. కాలిన గాయాలు, రేడియేషన్ వల్ల జీవచ్ఛవాలయ్యారు.
ఈ షాక్ నుంచి తేరుకోక ముందే.. అమెరికాలో నాగసాకిపై మరో అణుబాంబు విసిరింది. ఫలితంగా ఆ రెండు నగరాల్లో మొత్తం 1.40 లక్షల మందికి పైగా ప్రజలు, సైనికులు చనిపోయారు. దీంతో జపాన్ అమెరికాకు తలవంచక తప్పలేదు. పెరల్ హార్బర్‌పై జపాన్ జరిపిన ఆకస్మిక దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకున్నా.. లక్షలాది మంచి ప్రజల ప్రాణాలు హరించిన పాపం మాత్రం ఆ దేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.