యాప్నగరం

NASA Viral Video: బ్లాక్‌హోల్ వీడియో విడుదల చేసిన నాసా

అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతున్న నాసా (NASA)... తాజాగా బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. అందులో బ్లాక్‌హోల్‌ని భూమిపై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? దగ్గరకు వెళ్లి పై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అన్నది చూపించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లకు అంతరిక్ష రహస్యాలపై ఆసక్తిని మరింత పెంచింది. బ్లాక్‌హోల్స్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 4 May 2022, 12:59 pm
సైన్స్ సిద్ధాంతాల్ని కట్టకట్టి పక్కన పడేసేవి కొన్ని ఉన్నాయి ఈ విశ్వంలో. బ్లాక్ హోల్స్ (Black Hole) అలాంటివే. వాటి దగ్గర ఏ సైన్సూ పనిచెయ్యదు. గురుత్వాకర్షణ మాత్రమే పనిచేస్తుంది. ఈ విశ్వంలో దేనినైనా తనలోకి లాగేసుకునేంత శక్తి బ్లాక్‌ హోల్‌ (కృష్ణబిలం)కి ఉంటుంది. కాంతిని కూడా తనలోకి లాగేసుకోగలవు కాబట్టే... బ్లాక్ హోల్స్‌ విషయంలో కాలం అన్నది లేదు. బ్లాక్‌ హోల్‌లో పడినది ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. అలాంటి కృష్ణ బిలాలు మన పాలపుంత గెలాక్సీలో (milkyway galaxy).. కోటి నుంచి 100 కోట్ల దాకా ఉంటాయని అంచనా. ఇక విశ్వంలో ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఇవి నిరంతరం విశ్వ పదార్థాల్ని తమలోకి లాక్కుంటూనే ఉన్నాయి. అందుకే వీటి రహస్యాలు తెలిస్తే తప్ప... మనం అంతరిక్షంలో ముందుకు వెళ్లలేమని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA)... బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది.
Samayam Telugu బ్లాక్‌హోల్ వీడియో విడుదల చేసిన నాసా (image credit - instagram - NASA)


బ్లాక్ హోల్ ఎలా ఉంటుంది?
మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఇది. ఈ నల్ల కన్నం (Black hole) కంటితో చూద్దామంటే కనిపించదు. ఏ టెలిస్కోపుతో చూసినా కనిపించదు. కారణం నల్లగా, శూన్యంలా ఉండటం వల్లే. దీని చుట్టూ ఉన్న నక్షత్రాలు, ఇతర విశ్వ పదార్థాలు మెరుస్తూ ఉంటాయి. అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. వాటి ఆధారంగా... వాటి మధ్యలో ఓ బ్లాక్ హోల్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే... గుండ్రంగా బంతిలా ఉండే బ్లాక్ హోల్ చుట్టూ విశ్వ పదార్థం ఎలా తిరుగుతుంది? అందులోకి పదార్థం ఎలా వెళ్తుంది? వంటి విషయాల్ని వివరించేందుకు నాసా ఓ సిమ్యులేషన్ వీడియోని రిలీజ్ చేసింది. బ్లాక్‌హోల్‌ని భూమిపై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది? దగ్గరకు వెళ్లి పై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అనేది వివరించింది. ఇది నిజమైన బ్లాక్ హోల్ కాదు. గ్రాఫికల్ ప్రజెంటేషన్ మాత్రమే.
Plastic break down: ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్.. కొత్త మార్గం వెతికిన పరిశోధకులు
"ఈ వీడియోని ఎక్కువసేపు చూడకండి... మిమ్మల్ని తనలోకి లాగేసుకుంటుంది" అని నాసా వీడియోకి సరదా క్యాప్షన్ ఇచ్చింది. కృష్ణ బిలాలు... వేర్వేరు యాంగిల్స్ నుంచి కాంతిని గ్రహిస్తాయి కాబట్టి... ఇలాంటి షేపులో కనిపిస్తాయని నాసా తన పోస్టులో వివరించింది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
View this post on Instagram A post shared by NASA (@nasa)

ఈ విజువలైజేషన్‌ని నాసా 2019లో తొలిసారి పబ్లిష్ చేసింది. అంతకు 6 నెలల ముందు సైంటిస్టులు... ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ విడుదల చేసిన మొదటి బ్లాక్ హోల్ ఫొటోను ప్రపంచానికి చూపించారు.
View this post on Instagram A post shared by Courtney Hunt MD (@courtneyhuntmd)

Rectangle Nebula: దీర్ఘచతురస్రాకార నెబ్యులా.. విశ్వంలో ఒక్కటే!
బ్లాక్ హోల్స్‌కి సంబంధించి ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు చాలా విషయాలు చెప్పారు. ఈ అంతుబట్టని రోదసీ రహస్యాలు శాస్త్రవేత్తలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. బ్లాక్‌హోల్‌లోకి వెళ్లిన పదార్థం మరో విశ్వంలోకి వెళ్తుందనే అంచనాలను కొందరు శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. బ్లాక్‌హోల్స్ అంత బలంగా పదార్థాల్నీ, కాంతినీ ఎలా లాగేసుకుంటున్నాయనే ప్రశ్న వారికి తేలని సవాలుగా మారింది. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు లోతుగా ఆలోచిస్తున్నవాటిలో డార్క్ మ్యాటర్ (Dark Matter)తో పాటూ బ్లాక్ హోల్సూ ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.