యాప్నగరం

FRBs: అంతరిక్షంలో అంతుబట్టని రహస్యం.. ఆ తరంగాల్ని పంపిస్తున్నదెవరు?

అంతరిక్ష రహస్యాలకు సంబంధించి నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహా... ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నింటికీ అంతుబట్టని ఓ విషయం ఉంది. అదే విచిత్ర తరంగాలు. రోదసీ నుంచి వస్తున్న ఆ తరంగాల్ని గ్రహాంతరవాసులు పంపిస్తున్నారా లేక.. మరేదైనా కారణంతో వస్తున్నాయా అనేదానిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 14 May 2022, 2:19 pm
సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అద్భుతంగా వాడేసుకుంటున్న రోజులు ఇవి. ఐతే... కొన్ని విషయాల్లో మాత్రం మన అభివృద్ధీ, టెక్నాలజీ ఇవేవీ పనిచేయట్లేదు. ముఖ్యంగా అంతరిక్షానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు రహస్యాలుగానే ఉంటున్నాయి. వాటిలో కొన్ని పాతవి కాగా... కొన్ని కొత్తగా ఈ లిస్టులో చేరుతున్నాయి. అలా చేరిన వాటిలో ఒకటి FRBs. వీటినే ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (fast radio bursts) అంటున్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నా... వీటికి సంబంధించిన రహస్యానికి పరిష్కారం దొరకట్లేదు. తాము ఏదైనా కనిపెట్టాలి అనుకుంటే.. శాస్త్రవేత్తలు అంత తేలిగ్గా ఆ విషయాన్ని వదిలేయరు. ఎన్నేళ్లైనా పరిష్కారం కనుక్కొని తీరతారు. ఐతే... FRBల విషయంలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడట్లేదు. కారణం... ఆ తరంగాల తీరే. పేరు ప్రకారం ఇవి రేడియో తరంగాల్లో అత్యంత వేగవంతమైన తరంగాలు. ఇవి చాలా వేగంగా వచ్చి భూమిని ఢీకొంటున్నాయి. వీటి జీవిత కాలం చాలా తక్కువ సేపు ఉంటోంది. ఎంత తక్కువంటే... సెకండ్‌లో వెయ్యోవంతు (Millisecond) సమయం మాత్రమే ఈవి జీవించి ఉంటున్నాయి. అంటే... అలా భూమిని ఢీకొట్టగానే.. ఇలా మాయమవుతున్నాయి. 2007లో తొలిసారి రేడియో టెలిస్కోపులు FRBలను గుర్తించాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ అవేంటో తెలియట్లేదు.
Samayam Telugu how fast radio bursts reach the earth from space are there aliens to send them
FRBs: అంతరిక్షంలో అంతుబట్టని రహస్యం.. ఆ తరంగాల్ని పంపిస్తున్నదెవరు?

(image credit - pixabay)


ఎక్కడి నుంచి వస్తున్నాయి?

మనం ఉన్నది పాలపుంత గెలాక్సీ (MilkyWay)లో. అందువల్ల మన భూమి దగ్గరకు ఏవి వచ్చినా... అవి ఆ గెలాక్సీ నుంచే వస్తున్నాయి. కానీ FRBలు మాత్రం వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయి. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి అవి వస్తున్నాయి. ఈ పాయింటే శాస్త్రవేత్తల్ని ఆకట్టుకుంటోంది. సపోజ్ మనం ఓ రాయిని 50 అడుగుల దూరం విసరాలంటే... కొంత ఎనర్జీని వాడుతాం. అదే రాయిని వంద అడుగుల దూరం విసరాలంటే... మరింత ఎక్కువ ఎనర్జీ వాడుతాం. అదే రాయిని కిలోమీటర్ దూరం విసరాలంటే... ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. మరి... కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి FRBలు రావాలంటే... ఎంత ఎనర్జీ అవసరం? క్షణకాలంలో భారీ ఎనర్జీ వాడితే... ఆ జోరుతో అవి వస్తున్నట్లు ఇక్కడిదాకా లెక్క. ఆ ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? సూర్యుడి నుంచి 80 ఏళ్లలో ఎంత ఎనర్జీ విడుదల అవుతుందో.. అంత ఎనర్జీ క్షణకాలంలో అక్కడ రిలీజైనట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే అతి భారీ పేలుడు లాంటిది జరిగినట్లు లెక్క.

(image credit - pixabay)

అక్కడ ఏం జరిగివుంటుంది?

భారీగా ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే... అంతరిక్షంలో భారీ ఘటన ఏదో జరిగివుండాలి. రెండు బ్లాక్ హోల్స్ ఢీకొట్టుకొని ఉంటాయి అని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే... కాదు... వాటిని గ్రహాంతరవాసులే (extraterrestrial civilisations) తాము అక్కడ ఉన్నట్లు తెలియజెయ్యడానికి భూమివైపు పంపిస్తున్నారు అంటున్నారు మరి కొందరు శాస్త్రవేత్తలు. బ్లాక్‌హోల్స్ లాంటివి ఢీకొట్టుకుంటే... అలాంటి తరంగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏలియన్స్ అలాంటివి పంపించడం తేలిక కాదు. ఆ స్థాయి టెక్నాలజీయే వారికి ఉంటే... డైరెక్టుగా వారే రావచ్చు. ఇలా పేలుళ్లు జరపాల్సిన అవసరం ఏముంటుంది అనేది మరో అంశం.

(image credit - pixabay)

2017లో మరో విచిత్రం:

2007లో వచ్చిన FRBల సంగతితేలక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటుంటే... 2017 ఆగస్టులో వారికి మరో అతిపెద్ద సవాల్ ఎదురైంది. FRB 121102 అనే సేమ్ తరంగాలు ఈసారి ఓ చిన్న గెలాక్సీ నుంచి భూమిని చేరాయి. ఆ గెలాక్సీ భూమికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల అవతల ఉంది. చిత్రమేంటంటే... ఒకే రోజు మొత్తం 93 సార్లు ఆ తరంగాలు భూమిని ఢీకొట్టాయి. అందువల్ల గెలాక్సీలో ఏదో భారీ ఘటన జరగడం వల్లే అవి ఒకే రోజున అంతగా వచ్చాయని అంచనా వేశారు. అంటే అక్కడేదో భారీ పేలుడు జరిగినట్లే. ఆ పేలుడు దాటికి ఆ తరంగాలు దూసుకొచ్చి భూమిని ఢీకొట్టాయి అనుకోవచ్చు. అత్యంత వేగంగా తిరిగే న్యూట్రాన్ స్టార్స్ (neutron stars) లేదా... బ్లాక్‌హోల్స్‌లో కంటిన్యూగా పడిపోతున్న పదార్థం నుంచి అవి దూసుకొస్తూ ఉండొచ్చనే అంచనా ఉంది.

(image credit - pixabay)

ఏలియన్స్ పంపితే మంచిదే:

ఈ తరంగాల్ని గ్రహాంతరవాసులు పంపుతున్నట్లైతే... అది మనకు ఏలియన్స్ నుంచి వస్తున్న సంకేతంగా భావించవచ్చు. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు అలా అనుకోవట్లేదు. ఈ FRBలలో కూడా 2 రకాలున్నాయి. ఒకరకం మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వస్తున్నాయి. రెండోరకం ఒకసారే వచ్చి తర్వాత రావట్లేదు. 2018 అక్టోబర్‌లో రెండోరకమైన నాన్-రిపీట్ FRBలు 19 వచ్చాయి. వాటిలో ఒకటి చాలా కాంతివంతంగా ఉంది. వీటిని పరిశీలించడం ద్వారా అవి వచ్చిన గెలాక్సీలకు సంబంధించి కీలక విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఐతే... క్షణకాలంలో వచ్చి మాయమయ్యే వాటిని కనిపెట్టడం కష్టమవుతోంది. కానీ ఎప్పటికైనా ఈ రహస్యాన్ని ఛేదించాలని శాస్త్రవేత్తలు పట్టుదలతో ఉన్నారు.

(image credit - pixabay)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.