యాప్నగరం

విరాట్‌తో ఫ్రెండ్‌షిప్.. వార్నర్ స్పందన అదుర్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఫ్రెండ్‌షిప్ విషయమై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

TNN 7 Apr 2017, 7:31 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నేను ఇప్పటికీ మంచి స్నేహితులమని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లు కోహ్లిని అవమానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ ఆటగాళ్లతో ఇకపై మైత్రి ఉండబోదంటూ విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వార్నర్ ఇలా స్పందించాడు. ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్భంగా.. వార్నర్ విరాట్‌తో కాసేపు మాట్లాడాడు. మేం ఆటగాళ్లం, మా పని మేం చేస్తాం.. అదృష్టవశాత్తూ నేను కోహ్లి ఇప్పటికీ స్నేహితులమే అని వార్నర్ చెప్పాడు.
Samayam Telugu virat kohli and i still good friends david warner
విరాట్‌తో ఫ్రెండ్‌షిప్.. వార్నర్ స్పందన అదుర్స్


ఒక్కోసారి మైదానంలో ఎమోషన్లను చాలా సిరీయస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కాసేపటి తర్వాత మళ్లీ ఆలోచిస్తాం. మేమంతా స్నేహితులం అంటూ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇరు జట్ల మధ్య ఆటగాళ్ల జరిగిన మాటల యుద్ధం గురించి వార్నర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో, ప్రపంచ క్రికెట్లో చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంది. క్రికెట్ ఆడటాన్ని మేం ఇష్టపడతాం అంటూ వార్నర్ చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఎప్పుడు జట్టుతో చేరతాడనే విషయమై వార్నర్ కచ్చితంగా బదులివ్వలేదు. ఏప్రిల్ 12న ముంబైతో మ్యాచ్ నాటికి ఇక్కడికి రావొచ్చని సూచనప్రాయంగా వెల్లడించాడు. డిఫెండింగ్ ఛాంపియన్లు కావడం వల్ల ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదు.. మా ఆట మేం ఆడతాం, నూరు శాతం కష్టపడతాం అంటూ వార్నర్ తనదైన స్టయిల్లో బదులిచ్చాడు. ఏప్రిల్ 5న జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 35 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.